పరశురామ జయంతి
శ్రీ పరశురామ జయంతి : 25 ఏప్రిల్ 2020
✍️
పరశురాముని కథ ఇదీ- జమదగ్ని, రేణుకల కుమారుడు పరశురాముడు. రేణుకాదేవి ఒక రాజును మోహించిందని భావించి జమదగ్ని ఆమెను వధించమని కొడుకులను ఆదేశించాడు. మిగిలిన వారు నిరాకరించగా పరశురాముడు తండ్రి ఆజ్ఞను నిర్వర్తించాడు. తండ్రి సంతోషించి వరం కోరుకో అంటే- 'తల్లిని బతికించమని, సోదరులను మన్నించమని' పరశురాముడు అడిగాడు. తండ్రి అతడి కోరిక తీర్చాడు. తరవాత పరశురాముడు- తాత 'రుచీకుడి' దగ్గరకు వెళ్లాడు. రుచీకుడు మనవడి తీరుతెన్నులు గమనించి, తపస్సు చేయమని సూచించాడు.
రౌద్రాస్త్రం
పరశురాముడు శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై 'వరం కోరుకో' అన్నాడు. రౌద్రాస్త్రం ఇమ్మని పరశురాముడు అడిగాడు. అంత అస్త్రాన్ని భరించగల శక్తి నీకింకా లేదని శివుడు అన్నాడు. పరశురాముడు తపస్సు కొనసాగించాడు. అంతలో దానవులు దేవలోకం మీద దాడి చేశారు. శివుడు పరశురాముని రప్పించి, దానవులను తరిమేసే బాధ్యత అప్పగించాడు. 'నా దగ్గర ఆయుధం లేదే' అన్నాడు పరశురాముడు. అప్పుడు శివుడు అతనికి ఒక పరశువు (గొడ్డలి) ఇచ్చాడు. పరశురాముడు దానవులను తరిమికొట్టి మళ్లీ తపస్సులో కూర్చున్నాడు. శివుడు మరోసారి ప్రత్యక్షమై అతడు కోరిన వస్త్రాలన్నీ ఇచ్చాడు.
దానం - ప్రాయశ్చిత్తం
ఆ తరవాత 'వెయ్యి చేతులు' గల కార్తవీర్యార్జునుడు అనే రాజు సపరివారంగా జమదగ్ని ఆశ్రమానికి వెళ్లాడు. జమదగ్ని తన దగ్గరున్న కామధేనువు వల్ల అన్ని పదార్థాలూ పొంది రాజుకు విందు చేశాడు. రాజు ఆ కామధేనువును అపహరించాడు. అడ్డు వచ్చిన జమదగ్నిని భటులు సంహరించారు. భృగు మహర్షి వచ్చి జమదగ్నిని తిరిగి జీవింపజేస్తాడు. కార్తవీర్యుని దురాగతం గురించి తెలిసిన పరశురాముడు ఇరవై ఒక్కసార్లు దండెత్తి కార్తవీర్యునితో సహా రాజులందరినీ వధించాడు. అలా సంపాదించిన భూమిని కశ్యపునికి దానం చేసి, హింసకు ప్రాయశ్చిత్తంగా తండ్రి సూచనపై తపస్సుకు వెళ్లిపోయాడు.
శ్రీహరి అవతారం
వైశాఖ మాస శుక్ల పక్ష తృతీయ పునర్వసున, రాత్రి మొదటి యామం సమయంలో హరియే రామునిగా, రేణుకా గర్భం నుండి స్వయంగా అవతరించాడు. అప్పుడు ఆరు గ్రహాలు తమ తమ ఉచ్చ స్థానాల్లో ఉన్నాయి. మిథునంలో రాహు గ్రహం ఉన్నాడు.
సమర్పణ :
🕉️ దైవమ్ డిజిటల్
Comments
Post a Comment